బాలు గారి మొదటి పాటకి 50 ఏళ్ళు !!!!

sp hits
sp hits

గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తొలి పాట పాడి ఈ డిసెంబర్ 15 కి 50 ఏళ్ళు పూర్తయింది. 50 ఏళ్ళ పాటు దిగ్విజయంగా ఈ పాటల ప్రపంచం లో రారాజు గా వెలుగొందుతున్న ఎస్పీ బాలు గారిని చూసి మన తెలుగువారు అంత గర్వపడాలి. నిజంగా తెలుగు సినిమాకు ఇదొక పర్వదినం లాంటిది. సినిమా పరిశ్రమ మొత్తం ఆయనను ఘనంగా సత్కరించాలి కూడా. వేలాది పాటలతో అలరించడమే కాకుండా, సంగీత దర్శకునిగా, నటునిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా,  ఆయన బహుముఖ ప్రజ్ఞ కనబరిచిన తీరు భావితరాలకు ఆదర్శం. ‘ శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న’ చిత్రం కోసం 1956  డిసెంబర్  15 న ‘ఏమి ఈ వింత మోహమో’ అనే పాటను తొలిసారి గా పాడారు బాలు.  ఎస్పీ బాలు గురించి గొప్ప రచయిత – నటుడు అయిన తనికెళ్ళ భరణి ఓ సందర్భం లో అద్భుతమైన పొయిట్రీ రాసారు. ఈ సందర్భంగా ఈ పొయిట్రీ మరోసారి మీకోసం .

బాల‌గాంధ‌ర్వం
తూర్పున సుప్ర‌భాతం
అయిన‌ట్టుంటుంది ఆ గాత్రం
శివాల‌యంలో గంట‌మోగిన‌ట్టు
ప‌విత్రంగానూ
శంఖం ఊదినట్టు
స‌హ‌జంగానూ ఉంటుంది –
న‌వ‌ర‌సార్ణ‌వాల్నీ
ఘ‌నీభ‌వింప‌జేసి
గొంతులో దాచుకున్న‌
స‌హ‌జ కంఠుడు బాలు –
కొంత‌మంది అదృష్ట‌వంతుల‌కి
నాలుక‌మీద బీజాక్ష‌రాల్ని
రాస్తుంద‌ట స‌ర‌స్వ‌తి!
కానీ బాలు నాలిక‌నే
శార‌దా పీఠం చేసుకుని
వెల‌సింది త‌ల్లి స్వ‌ర‌స్వ‌తి!!
తెలుగువారికి అవ‌కాయ‌న్నా
గోదార‌న్నా ఏడుకొండ‌ల వెంక‌న్నన్నా
ఎంతిష్ట‌మో బాలు పాట అంత‌క‌న్నా ఇష్టం!!
అందుకే తెలుగిళ్ల‌లో
ఎక్క‌డ పెళ్ళిళ్ళు జ‌రిగినా
తోర‌ణాలతోపాటు
బాలు పాట‌ల్ని క‌డ‌తారు!
శోభ‌నాల గ‌దిలో
పాలగ్లాసు ప‌క్క‌న‌
బాలు క్యాసెట్ పెడ‌తారు!!
పాపాయి ఏడుస్తుంటే
ఎక్క‌ణ్ణించో బాలు గాలిలో
లీలగా తేలుతూ వ‌చ్చి జోల పాడ‌తాడు !
బాలు బొండు మ‌ల్లెంటి మనిషి –
స్నేహ ప‌రిమ‌ళాన్ని వెద‌జ‌ల్లుతాడు
బాలు అంద‌రి ఇంట్లో మ‌నిషి –
ఎవ‌ర‌న్నా ఏడుస్తుంటే
పాట చూపుడు వేలుతో
క‌న్నీరు తుడుస్తాడు !!
                                               – త‌నికెళ్ల భ‌ర‌ణి
SHARE