బాలూ… నీ పాట !

sp balasubrahmanyam
sp balasubrahmanyam

సాక్షాత్ శివ జ‌టాజూటం నుండీ స్వ‌రామృత మంత్ర‌మై
ప్ర‌వ‌హించి వ‌చ్చిన గంధ‌ర్వ గ‌ళ‌మా!
ఒక దివ్య హ‌రిక‌థా స్ర‌వంతి సాంబ‌మూర్తిమంత‌మై
కోనేటమ్మపేట శకుంత‌మ్మై పురుడోసుకున్న మంగ‌ళ కాహళీ
ట్రాన్‌సిస్ట‌ర్ ట్రాన్స్‌లోంచి… రేడియో అల‌వ‌రుస‌ల మీదుగా
రెక్క తొడిగి, అనంతాలాప‌నై త‌పించిన మంజుల స్వ‌న‌మా!

బాలూ ! నాద‌మూర్తివై వ‌చ్చావు మాతృగ‌ర్భం నుంచీ..
బ‌హు భాష‌ల గ‌ళానువాద‌మై… స్వ‌ర విరించివైనావు
నీ పాట‌లో ప్ర‌జ‌లు వాళ్ళ గొంతులు ఏరుకుంటాంటారు !
నీ పాట చిన్నారుల చిగురు కంఠాల‌కి
వ‌సంతాన్ని బ‌హుక‌రిస్తుంది !
నీ పాట‌ల్ని కోకొల‌ల్తో పాటు….
ఆబాల గోపాల‌మూ ప‌ల‌వ‌రిస్తారు!
హిమాల‌యాలు నీ పాట‌కి చ‌మ‌రిస్తాయి. !

బాలూ !
నీ పాట‌లు బీట‌లువారిన పొలాల గుండెల్లోకి
మ‌హాన‌దులై ప్ర‌వ‌హిస్తాయి…
భూమ్యాకాశాలు అవ‌హిస్తాయి…
నీ ఆలాప‌న శ‌త‌కోటి దేవ‌త‌ల‌కి గ‌ళార్చ‌నౌతుంది.
గ‌ద్గ‌ద జ‌గద్గ‌ళం స‌వ‌రించే నీ స్వ‌ర ద్వారం తెరుచుకుని
తేట తెనుగు పాట‌… తెర‌లు తెర‌లుగా వెల్లివిరిస్తుంది. !

– ఎమ్మెస్ సూర్య నారాయణ , ప్రముఖ కవి ( ‘శబ్ద భేది’ పుస్తకం నుంచి )

SHARE